మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు.. పరువు నష్టం నోటీసులు: ఏపీ విద్యాశాఖ హెచ్చరిక

  • నిరాధార ఆరోపణలు చేసినవారు క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • 15,941 పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందన్న ప్రభుత్వం
  • పేపర్ లీక్, అక్రమ ఎంపికల ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ
  • అభ్యర్థులు తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచన
ఏపీలో గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. నిరాధార ఆరోపణలతో సమాజంలో గందరగోళం సృష్టిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు, పరువు నష్టం నోటీసులు జారీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది. తప్పుడు ప్రచారం చేసిన మీడియా, సోషల్ మీడియా, పలువురు వ్యక్తులు తక్షణమే విద్యాశాఖకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ వంద శాతం పారదర్శకంగా జరిగిందని, అభ్యర్థులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది. "రాష్ట్రంలో మొత్తం 15,941 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రభుత్వ ఉత్తర్వులు, నియామక నిబంధనలతో పాటు రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగానే జరిగింది. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై కనీస అవగాహన లేకుండా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, మెరిట్ జాబితాలు ప్రచురించలేదని, అక్రమ ఎంపికలు జరిగాయని ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు" అని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది.

ప్రతి దశలోనూ పారదర్శకత, డిజిటల్ భద్రత, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్ఠంగా అమలు చేశామని ప్రభుత్వం పేర్కొంది. మెరిట్, ఎంపిక జాబితాలతో పాటు అన్ని వివరాలను నోటిఫై చేసిన విధానం ప్రకారమే పారదర్శకంగా ప్రచురించామని, ఎంపిక ప్రక్రియ మొత్తం కేవలం మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా అత్యంత సురక్షితమైన డిజిటల్ విధానంలోనే నిర్వహించామని వివరించింది.

ఈ అబద్ధపు ప్రచారాలు అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు రేకెత్తించడమే కాకుండా విద్యాశాఖ ప్రతిష్టకు, నియామక ప్రక్రియ విశ్వసనీయతకు భంగం కలిగిస్తున్నాయని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం చేపట్టే అన్ని నియామక ప్రక్రియల్లో పారదర్శకత, నిష్పక్షపాతానికి కట్టుబడి ఉంటామని, అభ్యర్థులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

Mega DSC
AP DSC 2025
School Education Department
AP Government Jobs
Teacher Recruitment
Andhra Pradesh Education
DSC Recruitment Process
AP DSC allegations
AP DSC controversy
AP School Education

More Telugu News